Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters   

సంధ్యా ప్రబోధము 17.

(గత సంచిక తరువాయి)

V కటపయాద్యక్షర సంజ్ఞలచే గాయత్రీ మంత్రాక్షరములకు శత(100) సంఖ్యగా తేలియవచ్చెను. కాన వ్యాసభగవానులు భారతమును నూరు పర్వములుగ విభజించిరి. మరియు భ యనగ 'క' అను అక్షరము మొదలు భ వరకు గల సంఖ్య ఇరువది నాలుగు. ఇరువది నాలుగు అక్షరములతో గాయత్రీ మంత్రము ప్రకాశించున్నది. గాయత్రీ మంత్ర భాగ్యరూపమైనది భారతమని గారుడపురాణమును చెప్పబడియున్నది భా=సర్వ చరాచర జంతు జాలమున అనుస్యూతమై వెలు గొందు దివ్య ప్రకాశము. భాయాం రతాః=భరతాః=ఆ దివ్య జ్యోతిని గాంచవలయుననెడి కోరిక గలవారలు, యద్వా=లేక, భాయాం=బ్రహ్మ విద్యాయాం, రతాః ఆసక్తా=బ్రహ్మ విద్యయం దాసక్తులు- భారతులు. భారతానాం ఇమే జనాః భారతీయాః భారతుల సంతతిలోని వారలు భరత చక్రవర్తి పాలించి నందున భారతదేశ మనబడెను. భారతదేశమున జనించినవారు భారతీయు లనంబడెదరు- కాన, భారత భా=భారతమును, ర=రామాయణమును, లేక రామాయణమున ''సీతా యాశ్చరితం మహత్‌'' అని చెప్పబడెను. కాన శ్రీ రామాయణమని శ్రీ వైష్ణవ భక్తులందురు. లేక రమా=లక్ష్మీ అవతారమగు, యద్వా=లేక, రామా=స్త్రీ జాతియొక్క శ్రేష్ఠత్వమును సూచించు పతివ్రతయగు సీతాదేవి యొక్క మాహాత్మ్యము చెప్పబడుటచే రామాయణమనియు చెప్పబడెను. త=తత్వ జ్ఞానమును తెలియజేయు గ్రంధమగు భాగవతమును (ఇది భక్తి - జ్ఞాన - వైరాగ్య - తత్వ - ముక్తులను ప్రసాదించు నుత్తమ గ్రంధము) (ఇందు మొదటి శ్లోకమునందే గాయత్రీ మంత్రార్థమును ఇమిడ్చి రచించెను వ్యాస భగవానులు,) తెలియపరచును, ఈ పవిత్ర గాయత్రీ మంత్ర బోధకములగు గ్రంధత్రయమును పఠించి (వీని ఉపదేశానుసారము) సత్ర్పవర్తనముతో మెలంగ వలయును; మానవులు--మానవులు అనగా - మను=మంత్రమునకు సంబంధించిన వారలు=భారతులు=భారతీయులు మానవులు అనబడుదురని భావము.

VI వీరు మంచి భావ పరంపరలతో భాగవతమును రచించిన బమ్మెర పోత(నామాత్యుని) రాజు వలెను. మనోరంజకములైన రాగములతో దైవమును గానము చేసిన త్యాగరాజు వలెను. తాళము (లయ) వేయుచు, పరమాత్మ స్వరూపునిగ శ్రీరాముని యందు మనమును లయింపచేసి కీర్తించిన కంచెర్ల గోపరాజు వలెను ''భజన''మును చేయుదురు. యజనము=భజనము, సమానార్ధకములు గమనించుడు. భ=అనగ భ క్తి. భవ ఏవ భావః భవః=ఈశ్వరః అతడు సర్వభూత హృద్దేశమున వసించును. ఇది భావం=భావనతో చేయబడునది ఇది మానసిక క్రియ. జ=యనగ జపము. ఇది వాక్కుతో కీర్తించుట. ఇది వాచిక క్రియ. న=యనగ నమనము=నమస్కారము, ఇది కాయికముగ చేయుక్రియ. ఇట్లు కరణత్రయముతో చేయు క్రియయే=ఉపాసనమే=''భజన'' మనంబడును. మార్జనము, పాప పరిహార హోమము, పాప పూరుష పరిత్యాగము. ఆర్ఘ్యము, తర్పణము, సగుణ నిర్గుణ పరబ్రహ్మో పాసనము వరకు గల క్రియా కలాపమంతయును మానసికమగు భక్తితో చేయబడు క్రియ. జపము (గాయత్రీ మంత్రానుష్టానము) వాచికముగ చేయబడు క్రియ, దిఙ్నమస్కృతి. మునినమోవాకము, దేవర్షి పితృ వందనము, ఓం నమో భగవతే వాసుదేవాయ'' ''సాయం ప్రాతర్నమస్యంతి'' ''గోవిందాయ నమోనమః'' ''నమోస్త్వనంతాయ'' ''వాసుదేవ నమోస్తుతే'' మున్నగు ఉత్తరాంగ సంధ్యోపాస్తి యంతయును కాయికమగు న మన క్రియ. ఇట్లు మానసిక వాచిక కాయికములగు త్రికరణములతో చేయు సంధ్యోపాస్తి వైదిక మత ద్విజ కర్తవ్యత్రి కాల నిత్య భజనమని యెరుంగ తగినది. ''భజసేవాయాం'' అను ధాతు జనిత శబ్దమే భజన మనంబడును. ఈ భజనమునకు వైలెన్‌, హార్మోనియం, మర్దళము, తాళములు, డోలక్‌, కంజీ రాలతో నవసరము లేదు సుమా! భజ=సేవాయాం, అను ధాతువు వలన భజయన సేవించుట అని అర్ధము. చేతులతో తాళము వేయుటగాని, పుష్పములతో మాలికలను నిర్మించుటగాని కాయిక క్రియ. వాక్కుతో కీర్తించుట, నామస్మరణము చేయుట, మంత్ర జపానుష్ఠానము వాచిక క్రియ. భక్తితో తలంచుట, సంకల్పించుట, ధ్యానము, మానసిక క్రియ. ఇట్లు త్రికరణములతో చేయునది భజన మనంబడును. ఇది లౌకిక భజనము అనంబడును. సంధ్యోపాస్తి వైదిక మత ప్రవర్తకద్వజ కర్తవ్య భజనమని యెరుంగతగును. ఇట్లే ధర్మమువిశేష ధర్మము, సామాన్య ధర్మము అని ద్వివిధములు కాననగును.

విశేష ధర్మమేమనగ--VII

1. శ్రౌతదీక్ష- అగ్నిష్టోమము చేసి యజ్వయను నామమునకు, చయనము అను క్రతువును చేసి మహాగ్నిచిత్‌ అనునామమునను, సర్వతో ముఖము, పౌండరీకము, వాజపేయము మున్నగు క్రతువులు చేసి పౌండరీకయాజీ అను నామమునను శ్రుతివిహిత దీక్షను గైకొని అగ్నిరూప పరమాత్మను సేవించుట- 2. తంత్ర దీక్ష- తంత్ర శాస్త్రము ననుసరించి శరీరమే శ్రీ చక్రమని భావించి శరీరమున గల చిచ్ఛక్తి (పరమాత్మశక్తి)ని మాతృరూపమున భావించి దీక్షను స్వీకరించి పూర్ణదీక్షాపురుడై ''శ్రియానందనాథ అమృతానందనాధ'' మున్నగు దీక్షా నామములతో వ్యవహరింపబడుచు శ్రీ విద్యా పరతంత్రులై మెలంగుట- 3. I ఉపనయనమైనది మొదలు బ్రహ్మచర్య దీక్ష. II వివాహమైనది మొదలు గార్హస్థ దీక్ష. III శ్రౌతాగ్ని సేవనముచే యజ్ఞదీక్ష, శ్రీ చక్రారాధన మొనర్చుచు తాంత్రిక దీక్షలను వదలి, పిమ్మట సన్యసనమను IV తురీయాశ్రమ దీక్షను స్వీకరించి కర్మలను, కర్మ ఫలములను వదలి శిఖాయజ్ఞోపవీతములను దారాపుత్రులను, గృహారామములను శాస్త్రీయముగను, వైరాగ్య మానసిక భావముగను పరిత్యజించి ''చిద్ఘనానంద'' ''ప్రకాశానంద'' ''విద్యాతీర్థ'' ''విద్వా శంకర'' ''అవధూతేంద్ర'' అను దీక్షా నామములతో వ్యవహరింపబడుచు, జ్ఞాన దీక్షతో మెలంగుచు ఆత్మానందానుభూతి ననుభవించుట- అనునవి విశేష ధర్మాచరణము, ఇక సామాన్య ధర్మమేమనగ- బ్రహ్మచర్య దీక్షనుగొని విద్యా సముపార్జనము చేయుట- గార్హస్థదీక్షనుగొని దేవర్షి పితౄణములును తీర్చి అనృణ్యమును (ఋణ విముక్తిని) సముపార్జించుట- అనునవి సామాన్య ధర్మచరణము అని గ్రహించవలసి యున్నది.

VIII సా - సార్వత్రికముగను, సార్వ జనీనకముగను, సామరస్యముగను, సాధారణముగను, సామాన్యముగను ద్విజానీక మొనర్పదగిన ధ=ధర్మము స్నాన, సంధ్యా=సత్య సూక్తులను నిర్వహించు బ్రహ చర్యవ్రత నిష్ణాతులుగాని, గార్హస్ధమును స్వీకరించి దేవర్షి పితృభత మనుష్య యజ్ఞముల చేయుచు, దేవతారాధనలను సలుపుచు, మాతాపితృ దారా పుత్రాతిధి శిష్యానీకమును పోషింపుచు నిర్వహింపతగిన గృహస్థ ధర్మమున నిష్ణాతులై మెలంగువారలుగాని, చేయదగిన ధర్మమును, న=(నటనము=నర్తనము) నడపుకొనుటయే ''సాధన'' మనంబడును.

సామాన్య ధర్మమైన నటనను=నటించుట=నర్తించుట గాయత్రీ మహా మంత్రానుష్టానమే ఐహిక సుఖానుభవమే గాక. పారమార్ధిక మోక్షా నందానుభవము వరకును చేర్చగలిగిన ''ముఖ్య సాధనము'' శ్రీ గాయత్రీ మంత్రానుష్ఠానమేయని యెరుంగ వలయునని ప్రబోధము గావింపబడుచున్నది.

IX విశేష సాధనము- సామాన్య సాధనము, అని ద్వివిధము-1 అరుణముతో ప్రతి మంత్రమును పఠింపుచు సాష్ఠాంగ నమస్కారము చేయుట- 2 సౌరముతో ఉపాసించుట-3 త్రిచ విధానముగ ఉపాసించుట 4 ''ఘృణిస్సూర్య ఆదిత్యోం'' అను అష్టాక్షరీ మంత్ర జపానుష్ఠానముతో ఉపాసించుట అను విధులు విశేష సాధన మార్గముగ నిర్ణయింపబడి యుండెను.

''యజేచ్చైవ నిశాముఖే'' యని సాయంకాలా రంభముననే దేవతా పూజలు- శాక్తేయ పూజలు- శివపూజలు- చెప్పబడుచున్నవి, ''సాయం సంధ్యా ముపక్రమేత్‌'' అని సంధ్యా దేవతో పాసనము సాయంకాలము సందే ఉపనయనము నాడు ఉపదేశింపబడినది. అందు అర్ధ గాంభీర్యము కలదు. ఐహిక వ్యాపారమంతయును విరమించుటయు. కుటుంబ ఛిద్రములు మర చుటయు. వైరాగ్యము చేకూరుటయు, శాంతి సంప్రాప్తించుటయును అందిమిడియున్నవి, ఇట్టి గాయత్రీ మహా మంత్రానుష్ఠానమును సామాన్య విధిగ సాధనమును మన గురువులు మన కందించిరి. దానిని విడనాడుట చేతనే ఇప్పటి ద్విజానీకమునకు గౌరవము తరిగి, హైన్యము పెరిగి, నీచజనులచే బాధింపబడు దుర్యోగము, దైన్యము, దారిద్ర్యము, అమర్యాద ఆపదలు మెండుగ ప్రాప్తించుచు ద్విజాళి నిస్తేజస్కమై, నిర్విర్యమై దిగజారి పోవుచున్నది. కాన ద్విజాళికిది సంధ్యోపాసనమును మరువకుడని ప్రబోధించుచున్నయది.

X శ్లో|| బ్రహ్మణోపాస్యతే సంధ్యా విష్ణునా శంక రేణచ|

(కస్మాన్నోపాస్యతే సంధ్యా శ్రేయస్కామ

ద్విజేనవై)

కస్మాన్నోపా సయేద్దేవం శ్రేయస్కామో

ద్విజో త్తమః||

ఇతియోగ యాజ్ఞవల్క్యః

1. సకల చరాచర సృష్టిని చేయగల బ్రహ్మ గాయత్రీమంత్రాక్షర సంఖ్యగల ఇరువది నాలుగు తత్వములతో స్థూల శరీరములను, ప్రణవము అను ఇరువది ఐదవ వర్ణము వలన జీవుని సృజించి యీ గాయత్రీ మంత్రానుష్ఠాన ప్రభావముననే జగత్కల్పనమును చేయగలిగెను.

2. శ్రీ మహావిష్ణువు ఇరువది నాలుగు అవతారములనుధరించినట్లును, బ్రహ్మ సృజించిన జగమును పరిపాలింప గలిగెననియు చెప్పబడెను. యీ గాయత్రీ మంత్రానుష్ఠానమే అందుకు కారణము. పంచమ వేదమగు భారతమును అష్టాదశ పురాణములను రచించిన వ్యాస నారాయణ భగవానులు విష్ణుని పందొమ్మిదవ అవతారమని చెప్పబడెను.

3. లయకర్తయగు శంకరుడు గాయత్రీ మంత్ర జప ప్రభావముననే తన కార్యమగు లయమును, హిమగిరి రాజ శిఖరాగ్రమున తపస్సమాధి నిష్టలందు లయించి చేయగలిగెనని చెప్పబడెను. కాన తన హేయములను వదలి. హాసమునుచేయుచు శ్రేయమును ప్రేయమును గోరిన ద్విజుడు సంధ్యాదేవతను ఏల ఉపాసింపక పోవును? అని యోగ యాజ్ఞవల్క్యమహర్షి ప్రబోధించుచుండెను.

సంధ్యాదేవి యనగ సూర్యమండలాంతర్వర్తి యగు (దివ్యతేజము) చిచ్ఛక్తియని యెరుంగవలయును.

4. వశిష్ఠ మహాముని గాయత్రీ మంత్ర ప్రభావముననే కామధేనువును రక్షించుకొన గలిగెను.

5. విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షివైతివని వశిష్ఠుని వలన జయోక్తి పత్రమును పొందగలుగు తపశ్శక్తికి హేతువుగా గాయత్రీ మంత్రానుష్ఠానమే సుమా! సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి వీనికి కలుగుటకు కారణము గాయత్రీ మంత్ర జపతపమే సుమా!

6. వ్యాస భగవానులు అష్టాదశ పురాణములను, అష్టాదశోప పురాణములను, బ్రహ్మ సూత్రములను రచింపగలుగుటకు గాయత్రీ మంత్ర జప ప్రభావమే. శ్రీ మహావిష్ణుని 19వ అవతారము శ్రీ వ్యాస భగవానులని పురాణగాథలు కలవు.

7. వాల్మీకి మహర్షి ప్రచేతసుని ఉపదేశానుసారమున గాయత్రీ మంత్ర జప ప్రభావముననే గాయత్రీ మంత్రాద్యక్షరమగు ''తపస్స్వాథ్యాయ నిరతం'' అని శ్రీమద్రా మాయణరచనము తయను నక్షరముతో నారంభించి చివరి యక్షరమగు యకారముతో ముగించి ఇరువది నాలుగువేల శ్లోకములను రచించి జగద్విఖ్యాతి నొంచెను.

8. త్యాగరాజస్వామి గానలోలుని గూర్చి ఇరువది నాలుగు వేల కీర్తనలు=కృతులు గాయత్రీ మంత్ర ప్రభావముననే వ్రాయగలిగెను. పాడ (కీర్తింప) గలిగెను.

9. విద్యారణ్య మహాశయులు గాయత్రీ మంత్ర ప్రభావముననే బంగారమును బుక్కరాయ రాజ్యములో పది నిమిముల కాలము వర్షింపజేసెను.

10. శంకర దేశికులు విప్రకాంత దారిద్ర్యమును తెలిసికొని స్వర్ణ ధాత్రీ ఫలవృష్టిని ఆమె ఇంట వర్షింప చేయగలిగినది గాయత్రీ మంత్ర ప్రభావమే.

11. శ్రీరామచంద్రుడు సూర్యమండలమున గల చిచ్ఛక్తిని ఉపాసించియే (అగస్త్య మహర్షి ఉపదేశముచే) రావణుని జయింపగలిగెను.

12. పాండవ మధ్యముడగు అర్జునుడు శ్రీకృష్టునిచే ఉపదేశిపబడి గాయత్రీ మంత్రానుష్ఠానముచే సూర్యమండలాంతర్వర్తియగు చిచ్ఛక్తిని ఉపాసించియే యుద్ధమున కరాదులను జయింపగలిగెను.

13. కుంతీదేవి దూర్వాస మహాముని ఉపదేశానుసారము సూర్య మండలాంతర్వర్తియగు చిచ్ఛక్తిని ఉపాసించియే సూర్యానుగ్రహమును గడించి ధర్మార్జున భీమసేనుల నెడి వీరపుత్రులను గాంచుటయేగాక మాద్రియగు సపత్నికిని నకుల సహదేవులనెడి పుత్రరత్నములను ప్రసాదింపగలిగెను.

14. సత్రాజిన్మహారాజు ప్రతిధినము అష్టచార ప్రమాణ స్వర్ణప్రదమగు శ్యమంతకమను మణిని యా చిచ్ఛక్త్యు పాసనము వలననే పొందగలిగెను. ప్రజలను సంపన్నులను చేసి పాలింపగలిగెను.

15. అరణ్యవాసమున ఇడుమలకు గురి కాకుండునట్లు సూర్యచిచ్ఛక్తి వలన అక్షయమగు ఆహారము నొసంగు శక్తిగల యొక ఉత్తమ (స్ధాలిని) పాత్రను పొందగలిగెను ధర్మరాజు మహాశయుడు.

16. వాయువుత్రుడును, యాజ్ఞవల్క్య మహర్షియు సూర్య చిచ్ఛక్తిని ఉపాసించియే సమస్త విద్యలను పొందగలిగెను (అపుడు శుక్ల యజుశ్శాఖ యేర్పడెను.)

17. మను మహర్షి సూర్యచిచ్ఛక్తిని ఉపాసించియే (స్మృతి) ధర్మశాస్త్రమును వ్రాయగల గొప్ప జ్ఞానమును పొందెను. మనువు రచించిన స్మృతి=మనుస్మృతి యనబరగుచున్నయది. వాని సంతతి వారలే మానవులు.

18. విశ్వ నిర్మాణశక్తిని సూర్యచిచ్ఛక్తి నుపాసించియేవిశ్వకర్మ వాస్తు-భవన-నిర్మాణశక్తిని గాంచెను. దేవాగార నిర్మాణశక్తిని పొందగలిగెను.

19. అనూరుడు సూర్య చిచ్ఛక్తిని ఉపాసించియే సూర్య ప్రీతిగల రధసారధ్య సామర్ధ్యమును పొందగలిగెను.

20. మయూర మహాకవి సూర్యచిచ్ఛక్తిని ఆరాధించియే చీము, రక్తము, నీరు స్రవించు ఘోర కుష్ఠువ్యాధిని నిర్మూలించుకొన గలిగెను.

21. ప్రస్కణ్వ మహాముని సూర్య చిచ్ఛక్తిని ఆరాధించియే భగంధర వ్యాధిని పోగొట్టుకొన గలిగెను.

22. ప్రవరాఖ్యుడను విప్రోత్తముడు అన్నిరూప చిచ్ఛక్తిని ఉపాసించియే చిత్తైకాగ్రత గలిగి, దృఢమనస్కుడై, వరూధినీ చేష్టలకు లోనుగాక ధీరహృదయుడయ్యెను. సాయంకాలాగ్ని హోత్ర ఉపాసనా సమయమునకు హిమాలయము నుంచి స్వగృహమును చేరగలిగెను.

23. కణ్వమహర్షి సూర్యచిచ్ఛక్తి నారాధించి అసాధ్య శ్వేతకుష్ఠ బొల్లి వ్యాధిని పోగొట్టుకొన గలిగెను.

24. ద్రోవది సూర్యచిచ్ఛక్తి నుపాసించియే రాజసభలో మాన సంరక్షణమును చేసికొనగలిగెను. అక్షయ వస్త్రములను బడయ గలిగెను.

25. భగీరధుడు సూర్య చిచ్ఛక్త్యు పాసన ప్రభావముననే అసాధ్యమైన దేవనదీ అవతరణమును భూలోకమునకు తీసికొన రాగలిగెను.

26. ఋశ్య శృంగ మహర్షి సూర్యోపాసన ప్రభావముననే అంగరాజ్యమున కలిగిన ద్వాదశ వర్ష క్షామ బాధానివారణమును చేయగలిగెను ఇట్లు ఎన్నియో. యెందరో, అనంత ఫలములను పొందగలిగిరి. కావున నో ద్విజ సోదరు లారా! సూర్యమండ లాంతర్వర్తియగు చిచ్ఛక్తియగు సంధ్యా దేవతను ఉపాసించి శక్తివంతులై భారతదేశమునకు ప్రతిష్ఠను నిలువబెట్టి భారతులు, యదార్థ భారతులు, అగుదురుగాక యని గాయత్రీ నికేతన నిర్మాతయగు, గాయత్రీ పదారవింద సేవకుని చేత ప్రబోధము చేయబడుచున్నది.

ఇతిశమ్‌ - ఓం తత్‌ సత్‌

''దా ర కా చార్య''

సూరవరపు లక్ష్మిపతిశాస్త్రి

మైలవరం

Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters